అంశం 12జన్యు వైవిధ్యాల వారసత్వంతో జీవ పరిణామం మొదలైంది.
జన్యువులలో సంభవించే సహజ వైవిధ్యం వల్ల కొన్ని జంతువులకి మరింత మెరుగైన జన్యువులు సంక్రమించడం వల్ల, మరింత మెరుగైన లక్షణాలు సంక్రమించడం వల్ల, ఆ జంతువులు జీవన పోరాటంలో ఇతర జంతువుల మీద నెగ్గుతాయి. ఆ విధంగా సహజ ఎంపిక వల్ల జరిగే ప్రక్రియకే డార్విన్ ‘పరిణామం’ (evolution) అని పేరు పెట్టాడు. 1859 లో డార్విన్ యొక్క రచన "On the Origin of Species" వెలువడ్డ తరువాత, ఆ దిశలో మరింత విస్తృతమైన ప్రయోగాలు చెయ్యడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ముఖ్యంగా కొత్త పర్యావరణాలలో, ఆ పరిసరాలకి అలవాటు పడేలా జంతువులు చెందే పరిణతిని అర్థం చేసుకోడానికి ఎన్నో ‘స్థానిక పరిశీలనా కేంద్రాల’ (field stations) ఏర్పాటు జరిగింది. కాని ఆ విధమైన పరిశీలనల వల్ల అసలు జన్యు వైవిధ్యం ఎందువల్ల ఏర్పడుతోంది, తదుపరి సంతతిలో పై తరంలో లేని కొత్త లక్షణాలు ఎలా ఏర్పడుతున్నాయి మొదలైన ప్రశ్నలు సమాధానాలు దొరకలేదు. ఈ విధమైన చింతన కారణంగా 20 వ శతాబ్దపు ఆరంభంలో ‘ప్రయోగాత్మక పరిణామ శాస్త్రం’ అనే కొత్త వైజ్ఞానిక విభాగం ఆవిర్భవించింది. మొక్కలతో, జంతువులతో సునియంత్రితమైన ప్రయోగాలు జరిపి కృత్రిమంగా పరిణామాన్ని సాధించడమే ఈ శాస్త్రవిభాగం యొక్క లక్ష్యం. జన్యువులలో జరిగే ఉత్పరివర్తనలే (mutations) జన్యు వైవిధ్యానికి కారణం అని త్వరలోనే స్పష్టం అయ్యింది.
కొత్త ఉత్పరివర్తనల వారసత్వాన్ని విశ్లేషించడానికి మెండెలియన్ జన్యు శాస్త్రం ఒక కొత్త గణాంక పద్ధతినిచ్చింది. ఈ విధంగా, 1920 తొలినాళ్ళకి ప్రయోగాత్మక జీవపరిణామసిద్ధాంతవేత్తల (evolutionary biologists) తరం నిదానంగా జన్యుశాస్త్రవేత్తల (geneticists) మొదటితరంగా మారింది.