అంశం 15 కణంలోని కేంద్రకంలో డీ.ఎన్. ఏ. మరియు ప్రోటీన్లు ముఖ్య అణువులు.
మెండెల్, డార్విన్ లు తమ పరిశోధనలు ప్రచురించిన కాలంలోనే న్యూక్లియస్ లో డీ.ఎన్. ఏ. (deoxyribonucleic acid, DNA) ఓ ముఖ్యమైన రసాయనం అన్న విషయం బయటపడింది. కాని ఇరవయ్యవ శతాబ్దపు తొలిదశల్లో శాస్త్రవేత్తల దృష్టి డీ.ఎన్. ఏ మీద లేదు. ఒక తరం నుండి మరో తరానికి అనువంశిక సమాచారాన్ని చేరవేసే సామర్థ్యం డీ.ఎన్. ఏ. కన్నా ప్రోటీన్లకే ఎక్కువగా ఉంటుందని భావించేవారు.
Aడీ.ఎన్. ఏ. ఓ పెద్ద అణువు అని తెలిసినా, అందులోని నాలుగు ముఖ్యాంశాలు పదే పదే వరుసక్రమంలో వస్తూ ఓ కృత్రిమ పాలిమర్ లో లాగా అందులో ఒక విధమైన ఆవర్తక అణువిన్యాసం ఉండొచ్చని ఊహించారు. పైగా ఆ రోజుల్లో డీ.ఎన్. ఏ. కి కణసంబంధిత క్రియలు ఏవీ ఉన్నట్టు తెలీదు. ఇందుకు విరుద్ధంగా ప్రోటీన్ల విషయం తీసుకుంటే, ఎన్జైమ్ లు గా కణంలో వాటి క్రియలు, నిర్మాణాత్మక అంశాలుగా కణంలో వాటి పాత్ర – ఇవన్నీ ఆ రోజుల్లో బాగా తెలిసినవే. ప్రోటీన్లు పలు అమినో ఆసిడ్ల పాలిమర్లు అన్న విషయం కూడా తెలుసు. ఈ పాలిమర్లని పాలీ పెప్టైడ్ లు(polypeptide) అంటారు. డీ.ఎన్. ఏ. లో కనిపించే నాలుగు అక్షరాల అక్షరమాలతో పోల్చితే, ప్రోటీన్లలో అమినో ఆసిడ్లనే 20 అక్షరాలు ఉంటాయి కనుక డీ.ఎన్. ఏ. కన్నా ప్రోటీన్లే మరింత సమర్థవంతంగా తమలో సమాచారాన్ని పొందుపరుచుకోగలవు అని అనుకునేవారు.