అంశం 20 డీ.ఎన్. ఏ. అనే నిచ్చెనలోని సగభాగం మొత్తాన్ని కాపీ చేసుకోవడానికి నమూనాగా పని చేస్తుంది.
అడెనిన్ థైమిన్ తోను, గువనిన్ సైటొసిన్ తోను తప్పనిసరిగా జత కావలసి వుంది కనుక, వాట్సన్ మరియు క్రిక్ లు ఒక ఆసక్తకరమైన ప్రతిపాదన చేశారు. డీ.ఎన్. ఏ. లో ఒక సగం రెండవ సగాన్ని పునర్మించడానికి నమూనాగా పని చేస్తుందని సూచించారు. 1958 కల్లా ఈ ప్రతిపాదనకి రెండు దిశల నుండి ఆధారాలు సమకూరాయి. మొదట డీ.ఎన్. ఏ. పాలిమరేజ్ (DNA polymerase) అనే ఎన్జైమ్ కనుగొనబడింది. ఈ ఎన్జైమ్ నమూనాగా పని చేస్తున్న డీ.ఎన్. ఏ. లోని సగభాగానికి అందుకు పరిపూరకమైన న్యూక్లియోటైడ్ లని కూర్చుతుంది.
ఇక రెండవ ఆధారం నైట్రోజెన్ ఐసోటోప్ ల తో చేసిన ఓ అద్భుత ప్రయోగం. ఈ ప్రయోగంలో నైట్రోజెన్ ఐసోటోప్ ల సహాయంతో తరతరాల బాక్టీరియాలో జరిగే డీ.ఎన్. ఏ. అణువుల నిర్మాణాన్ని అనుసరించారు. డీ.ఎన్. ఏ. లోని ఒక పోగు (strand) జనక కణం నుండి శిశు కణాలని యథాతథంగా సంక్రమిస్తుంది అని తెలిసింది. ఇలా యథాతథంగా మిగిలిన దారం అందుకు పరిపూరక దారం యొక్క నిర్మాణానికి నమూనాగా పని చేస్తుంది. అలాంటి ప్రతిరూపాన్ని డీ.ఎన్. ఏ. పాలిమరేజ్ సంయోజిస్తుంది. ఆ విధంగా ఓ కొత్త, సంపూర్ణమైన డీ.ఎన్. ఏ. అణువు పుడుతుంది.