అంశం 21 డీ.ఎన్. ఏ. కి ప్రోటీన్ కి మధ్య మధ్యవర్తి ఆర్. ఎన్. ఏ.
డీ.ఎన్. ఏ. ఎక్కువగా కణంలో కేంద్రకంలోనే ఉంటుంది. కాని ఆర్. ఎన్. ఏ. (రైబో న్యూక్లీక్ ఆసిడ్) అనబడే మరో రకం న్యూక్లీక్ ఆసిడ్ సైటోప్లాసమ్ లో ఉంటుంది. ప్రోటీన్ లు సైటోప్లాసమ్ లో సంయోజింపబడతాయి కనుక కేంద్రకంలో ఉండే డీ.ఎన్. ఏ. సందేశాన్ని ఆర్. ఎన్. ఏ. కాపీ చేసి సైటోప్లాసమ్ లోకి తెస్తుందని వాట్సన్, క్రిక్ లు ప్రతిపాదించారు. అంతే కాకుండా ఓ "అనుసారక" (adaptor) అణువు ఉంటుందని, అది జెనెటిక్ కోడ్ ని చదివి, సరైన అమినో ఆసిడ్లని ఎంచుకుని, వాటిని ఎదుగుతున్న పాలీపెప్టైడ్ గొలుసుకు జతచేస్తుందని క్రిక్ ఊహించాడు. ఈ విధంగా జెనెటిక్ సమాచారం డీ. ఎన్. ఏ. నుండి ఆర్. ఎన్. ఏ. నుండి ప్రోటీన్ వరకు ప్రవహిస్తుంది అన్న భావనకే "కేంద్ర భావన" (central dogma) అని పేరు వచ్చింది."
డీ.ఎన్. ఏ->ఆర్. ఎన్. ఏ.-> ప్రోటీన్
జెనెటిక్ సమాచారం యొక్క వినియోగంలో ఎన్నో రకాల ఆర్. ఎన్. ఏ. లు పాలుపంచుకుంటాయని తదనంతరం తెలిసింది. కేంద్రకంలో డీ.ఎన్. ఏ. కోడ్ వార్తలని మోసే ఓ మెసెంజర్ ఆర్. ఎన్. ఏ. (mRNA) అణువుగా "అనులిఖించ" బడుతుంది (transcribe), లేదా కాపీ చెయ్యబడుతుంది. ఇక సైటోప్లాసమ్ లో mRNA కోడ్ అమినో ఆసిడ్లుగా "అనువదించ"బడుతుంది (translate). ఈ అనువాదం కార్యక్రమం కణంలో రైబోసోమ్ అనే వస్తువు మీద జరుగుతుంది. (ఈ రైబోసోమ్ పాక్షికంగా ఆర్. ఎన్. ఏ. తో నిర్మించబడ్డ వస్తువు.) ఈ కార్యక్రమంలో ట్రాన్స్ ఫర్ ఆర్. ఎన్. ఏ. (transfer RNA) అనే అణువు ముఖ్య పాత్ర వహిస్తుంది.