అంశం 23 జన్యువు అంటే డీ.ఎన్. ఏ. లో కొన్ని ప్రత్యేక న్యూక్లియోటైడ్ ల శ్రేణి.
ఓ దృగ్గోచరమైన లక్షణాన్ని శాసించే ఓ నిర్దిష్టమైన, అవిభాజ్యమైన వస్తువు అన్నట్లుగా మెండెల్ జన్యువు ని వర్ణించాడు. ఓ ప్రోటీన్ ని నిర్మించడానికి అవసరమైన ఆదేశాల క్రమం అన్నట్టుగా టాటమ్ మరియు బీడిల్ అనే శాస్త్రవేత్తలు జన్యువుని వర్ణించారు. కొన్ని ప్రత్యేక అమినో ఆసిడ్లు వరుసక్రమంలో కూర్చబడ్డ పొడవాటి మాలికలే ప్రోటీన్లని తొలి ప్రయోగాలు వెల్లడి చేశాయి. జెనెటిక్ కోడ్ లో మూడు అక్షరాల పదాలు ఉన్నాయని అర్థమయ్యాక జన్యువు అనే భావన మరింత సునిశితమయ్యింది. ఒక ప్రోటీన్ ని నిర్వచించే డీ.ఎన్. ఏ. మాలికే జన్యువు అని అర్థమయ్యింది. ఆ వరుసక్రమంలోని మొదటి కోడాన్ పేరు "ఆరంభం" (start) కోడాన్. చివరి కోడాన్ పేరు "ఆగు" (stop) కోడాన్.
ప్రత్యేక జన్యువు లలో ఉండే న్యూక్లియోటైడ్ ల శ్రేణి ని వెల్లడి చెయ్యగల పద్ధతుల ఆవిష్కరణతో జన్యు విశ్లేషణ కొత్త ఎత్తులని చేరుకుంది. డీ.ఎన్. ఏ. పాలిమరేజ్ ల గురించిన పరిజ్ఞానం, కణరహిత వ్యవస్థలలో డీ.ఎన్. ఏ. ద్విగుణీకరణ (replication) విధానాలు మొదలైన పద్ధతులు పునాదిగా డీ.ఎన్. ఏ. సీక్వెన్సింగ్ పద్ధతులు రూపొందించబడ్డాయి. "దోషపూరితమైన" డీ.ఎన్. ఏ. న్యూక్లియోటైడ్ ని తెలివిగా వాడుకునే chain-termination పద్ధతికి ప్రస్తుతం డీ.ఎన్. ఏ. సేక్వెన్సింగ్ పరిజ్ఞానంలో ఎంతో ప్రాధాన్యత వుంది.