అంశం 25 కొన్ని వైరస్ లు జన్యు సమాచారాన్ని ఆర్. ఎన్. ఏ. రూపంలో దాచుకుంటాయి.
జన్యు సమాచారం అంతా ఎప్పుడూ డీ. ఎన్. ఏ. రూపంలోనే పొందుపరచబడుతుంది అని నమ్ముతారు. పైగా వాట్సన్, క్రిక్ లు ప్రతిపాదించిన "కేంద్ర భావన" ప్రకారం సమాచారం ఎప్పుడూ ఏక దిశలో డీ.ఎన్. ఏ. నుండి ఆర్. ఎన్. ఏ నుండి ప్రోటీన్ దిశగా ప్రవహించాలి. కాని 1971 లో జరిగిన కొన్ని పరిశోధనల వల్ల కొన్ని సందర్భాలలో జన్యు సమాచారం ఆర్. ఎన్. ఏ. నుండి డీ. ఎన్. ఏ. దిశగా ప్రవహిస్తుంది అని తెలిసినప్పుడు శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు.
అయితే ఉన్నత జీవరాశుల లాగానే వైరస్ లు కూడా ప్రోటీన్ ల చేత నిర్మించబడ్డవే. ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు ఆర్. ఎన్. ఏ. కోడ్ "తిరిగి" డీ.ఎన్. ఏ. రూపంలో అనులేఖించబడుతుంది. ఆ తరువాత పరిపాటిగా ఆర్. ఎన్. ఏ. నుండి ప్రోటీన్ లు సంయోజించబడతాయి. తొలిదశలో కేంద్ర భావనకి వ్యతిరేకంగా ఆర్. ఎన్. ఏ. నుండి డీ. ఎన్. ఏ. తయారు కావడాన్ని "తిర్యక్ అనులేఖనం" (reverse transcription) అంటారు. ఈ రకమైన విధానం ఆధారంగా పని చేసే వైరస్ లని రెట్రో వైరస్ లు (retro virus) అంటారు. Reverse transcriptase అనే ఓ ప్రత్యేకమైన polymerase ఆర్. ఎన్. ఏ. ని నమూనాగా వాడుతూ అందుకు పరిపూరకమైన, రెండు మాలలు గల డీ.ఎన్. ఏ. అణువుని సంయోజిస్తుంది.