అంశం 26 ఆర్. ఎన్. ఏ. మొట్టమొదటి జన్యు అణువు.
1960 లలో జరిగిన ప్రయోగాల బట్టి మెసెంజర్ ఆర్. ఎన్. ఏ. అణువు తనలో జన్యు సమాచారాన్ని దాచుకోగలదని, అందుకు భిన్నంగా ట్రాన్స్ఫర్ ఆర్. ఎన్. ఏ. మరియు రైబోసోమల్ ఆర్. ఎన్. ఏ. లు జన్యు సమాచారాన్ని ప్రోటీన్ రూపంలోకి అనువదించగలవని తెలిసింది. ఆ తరువాత మరో రెండు దశాబ్దాల తరువాత జరిగిన అధ్యయనాల వల్ల ఆర్. ఎన్. ఏ. అణువు ఎన్జైమ్ గా పని చేసి తనలోని జన్యు సమాచారాన్ని తనే సవరించుకోగలదని (self-edit) తెలిసింది. ఈ ఫలితాల బట్టి రెండు ప్రశ్నలు బయల్దేరాయి – 1) జన్యు సమాచారం యొక్క ప్రసారంలో ఆర్. ఎన్. ఏ. అణువులు ఇన్ని రకాల పాత్రలు ఎందుకు పోషిస్తున్నాయి? 2) ఆర్. ఎన్. ఏ. లో జన్యు సమాచారాన్ని దాచుకోగలిగితే ఇక డీ. ఎన్. ఏ. ఎందుకు?
జన్యు అణువుగా పని చెయ్యడంలో ఆర్. ఎన్. ఏ. కి గొప్ప సామర్థ్యం ఉందనడంలో సందేహం లేదు. పరిణామ చరిత్రలో ఒక దశలో అనువంశిక ప్రక్రియలన్నీ ఆర్. ఎన్. ఏ. వల్లనే జరిగాయి. ఆర్. ఎన్. ఏ. యే మొట్టమొదటి అనువంశిక అణువు అని ప్రస్తుతం నిశ్చయంగా తెలిసిన విషయం. అందుకే డీ. ఎన్. ఏ. రంగప్రవేశం చెయ్యక ముందు జన్యు సమాచారాన్ని భద్రపరచడానికి, వ్యక్తం చెయ్యడానికి కావలసిన యంత్రాంగం అంతా ఆర్. ఎన్. ఏ. కి సమకూరింది. కాని ఒకే మాల గల ఆర్. ఎన్. ఏ. అణువులు అస్థిరంగా ఉంటాయి. ఎన్జైమ్ ల ప్రభావం వల్ల సులభంగా దెబ్బతిన గలవు. రైబోస్ కి బదులుగా డీ ఆక్సీ రైబోస్ షుగర్ ని వాడుకుని ఒకే మాల ఉన్న ఆర్. ఎన్. ఏ. కాస్తా రెండు మాలలు ఉన్న డీ. ఎన్. ఏ. రూపాంతరం చెంది మరింత స్థిరమైన అణువుగా మారింది. ఆర్. ఎన్. ఏ. కన్నా మరింత స్థిరమైన డీ. ఎన్. ఏ. జన్యు సమాచారాన్ని మరింత కచ్చితంగా ఒక తరం నుండి తదుపరి తరానికి చేరవేయగలదు.