అంశం 28 కొన్ని ఉత్పరివర్తనలు వాటంతకవే సరిదిద్దబడతాయి.

Some types of mutations are automatically repaired.

1950 ల వరకు కూడా జన్యువులు స్థిరమైన వస్తువులని శాస్త్రవేత్తలు అనుకునేవారు. సూక్ష్మక్రిముల ప్రవర్తనలో కొన్ని విచిత్ర పరిణామాలని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తున్న శాస్త్రవేత్తలు డీ. ఎన్. ఏ. కూడా దెబ్బతినగలదన్న నిర్ణయానికి వచ్చారు. అతినీలలోహిత కిరణ (ultraviolet rays) ప్రభావానికి నాశనమైన క్రిముల రాశులని కిటికీ వద్ద కొంత కాలం ఉంచగానే మళ్లీ కోలుకుని వర్ధిల్లాయి. ఉత్పరివర్తక పదార్థం యొక్క ప్రభావానికి గురైన ఎంతో కాలం తరువాత జన్యు దోషాలు గల క్రిములు పుట్టడం కనిపించింది.

సూక్ష్మక్రిముల నుండి మనుషుల స్థాయి వరకు జరిగిన పరిశోధనలలో వాతావరణం నుండి వచ్చే ఉత్పరివర్తక పదార్థాల వల్లనైతేనేమి, డీ. ఎన్. ఏ. ద్విగుణీకరణలో వచ్చే దోషాల వల్ల నైతేనేమి డీ. ఎన్. ఏ. దెబ్బతినగలదని తెలిసింది. అంతేకాక అలా దెబ్బ తిన్న డీ. ఎన్. ఏ. ని తిరిగి సరిదిద్దే సామర్థ్యం గల ఓ విస్తారమైన ఎన్జైమ్ల జాతి కూడా ఉందని అర్థమయ్యింది. ఈ ఎన్జైమ్లు లేకపోతే డీ. ఎన్. ఏ. విధ్వంసం ప్రమాదకరమైన స్థాయికి చేరుకునే అవకాశం వుంది. అందుకనే డీ. ఎన్. ఏ. ని సరిదిద్దగల ఎన్జైమ్ల లో దోషాల వల్ల ఆయుర్దాయం తగ్గగలదు. కాని డీ. ఎన్. ఏ. దిద్దుబాటులోను, లేదా ద్విగుణీకరణలో దోషాలని సరిదిద్దే ప్రయత్నం లోను అప్పుడప్పుడు వైఫల్యం కలగడం కూడా జీవరాశుల మనుగడకి ఎంతో అవసరం. ఎందుకంటే ఇలాంటి వైపరీత్యాలే ఉత్పరివర్తనలుగా బయటపడతాయి. ఉత్పరివర్తనలే లేకుంటే జీవపరిణామం అసంభవం అవుతుంది.