అంశం 29 డీ. ఎన్. ఏ. క్రోమోజోంలలో ప్యాక్ చేయబడి ఉంటుంది.
జీవులలోని ప్రతి కణంలో ఉన్న కేంద్రకం (నూక్లియస్) లో క్రోమోజోమలు ఉంటాయని 19వ శతాబ్ధపు చివరి భాగంలో సైటాలజి (కణశాస్త్రం) లో జరిగిన పరిశోధనల ద్వారా తెలిసింది. అదే సమయంలో కేంద్రకం లో ఉండే క్రోమోజోముల్లో డీ. ఎన్. ఏ. మరియు ప్రోటీన్లు కలగలిసి ఉంటాయని బయోకెమిస్ట్రీ పరిశోధనల ద్వారా నిర్ధారణ అయింది. తరువాత 20వ శతాబ్దపు తోలి నాలుగు దశాబ్దాలలో కేంద్రకంలో ఉండే ప్రోటీన్లు తల్లిదండ్రుల నుండి పిల్లలకు లక్షణాలు సంక్రమించడానికి హేతువులని, డీ. ఎన్. ఏ. కేవలం ఆ ప్రోటీన్లను పరిరక్షించే కవచంలా పనిచేస్తుందని భ్రమ పడ్డారు."
కానీ ఈ ఊహని అబద్ధం చేస్తూ, నిజానికి డీ. ఎన్. ఏ. జెనిటిక్ మెటీరియల్ (తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమించే లక్షణాలకు మూల పదార్ధం) అని 1940వ మరియు 50వ దశాబ్దాలలో ఆవెరీ (Avery) మరియు హెర్షీ (Hershy) ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఆ తరువాత 1960, 70వ దశాబ్దాలలో జరిగిన పరిశోధనల ద్వారా క్రోమోజోంలో కేవలం ఒకే ఒక పెద్ద డీ. ఎన్. ఏ. మాలిక్యుల్ ఉంటందని తెలిసింది. అంతేగాక హిస్తోన్లు మొదలగు ప్రోటీన్లు ఆ డీ. ఎన్. ఏ. మాలిక్యుల్ కి ఒక ఆధారంగా మాత్రమే ఉంటాయని, డీ. ఎన్. ఏ. ప్రోటీన్లని చుట్టుకొని ఉంటుందని, అలా స్థిరంగా ప్రోటీన్లకు చుట్టుకొన్న డీ. ఎన్. ఏ. క్రోమోజోం గా రూపొందుతుందని నిర్ధారణ అయింది.