అంశం 30 కణాల్లో పురాతన క్రోమోజోములుంటాయి
కేంద్రకంలో ఉండే క్రోమోజోములే కాక, ప్రతి కణంలో శక్తిని ఉత్పత్తి చేసే "మైటోకాండ్రియా" వంటి కణ విభాగాల్లో కూడా క్రోమోజోం ఉంటుంది. మైటోకాండ్రియాలో ఉండే క్రోమోజోములో కణాలలో శక్తిని ఉత్పత్తి చేసే "ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్" అనే ప్రక్రియను నియంత్రించే జన్యువులు ఉంటాయి. మైటోకాండ్రియా కొన్ని వేల సంవత్సరాల క్రితం స్వేచ్ఛగా తిరిగిన క్రిమి (బాక్టీరియా) అని, తరువాత క్రమంగా ఈనాడున్న కణాలకి మూలమైన పురాతన కాణాలలోకి తీసుకోబడింది అని తెలిపే ఆధారాలున్నాయి. ఆ పురాతన కణాలు మైటోకాండ్రియాకి ఆహారాన్ని సమకూరిస్తే, దానికి బదులుగా మైటోకాండ్రియా ఆ కణానికి శక్తిని సమకూరుస్తుంది. ఈ రెండిటికీ లాభం కలిగించే ఈ సంబంధం, నేడు ఉన్న కణాలు ఆవిర్భవించడానికి మూలం.
మైటోకాండ్రియా పరిమాణంలో బాక్టీరియాని పోలి ఉండటమేగాక దాని జన్యువులలో కూడా బాక్టీరియా లక్షణాలు ఉంటాయి. బాక్టీరియాలో ఉన్నట్టే మైటోకాండ్రియా లో కూడా క్రోమోజోము వలయాకారంలో ఉండి, తక్కువ సంఖ్యలో ఇన్ట్రాన్లు (జన్యువులలో నిరుపయోగ ప్రదేశాలు) ఉంటాయి. మొక్కలలోని కణాలలో మైటోకాండ్రియాలోనే గాక "క్లోరోప్లాస్ట్" అనే ఆహారోత్పత్తి చేసే కణ విభాగం లో కూడా క్రోమోజోం ఉంటుంది. క్లోరోప్లాస్ట్ కూడా మైటోకాండ్రియాలానే ఒకప్పుడు బాక్టీరియా అని గుర్తించారు.