అంశం 31 డీ. ఎన్. ఏ. లో కొంత భాగం ప్రోటీన్లను ఉత్పత్తిచేయదు.
పరిశోధనలకోసం డీ. ఎన్. ఏ. ని కణంలోనుండి వెలికి తీసినప్పుడు ప్రోటీన్లను తొలగిస్తారు. అప్పుడు కేవలం డీ. ఎన్. ఏ., దానిలో ఉన్న జన్యు సమాచారం (జెనిటిక్ ఇన్ఫర్మేషన్) మాత్రమె ఉంటాయి. దీని వలన క్రోమోజోమనేది ఒకే ఒక పొడవైన, డీ. ఎన్. ఏ. మాలిక్యూల్ అని అర్థమవుతుంది. ఈ పొడవైన డీ. ఎన్. ఏ. మాలిక్యూల్ లో కొన్ని ప్రదేశాల్లో ఉన్న "న్యుక్లియోటైడ్ సీక్వెన్స్" (ఒక నిర్దిష్ట క్రమం లో అమర్చబడిన న్యూక్లియోటైడ్లు) లు కణంలోని వివిధ ప్రోటీన్లను తయారుచేసే జెనిటిక్ కోడ్ కలిగి ఉంటాయి.
బాక్టీరియా లో ఉండే జన్యువులలో ఉండే డీ. ఎన్. ఏ. దాదాపు అంతా ప్రోటీన్లను కోడ్ చేస్తుంది. కానీ 1960లో కొన్ని పరిశోధనలు జంతువులు, మొక్కలు మొదలగు పెద్ద జీవులలో (యూకారియోట్స్) ఉండే డీ. ఎన్. ఏ. లో చాలా భాగం ప్రోటీన్లను ఉత్పత్తిచేయదని చూపించాయి. వీటిని "నాన్ కోడింగ్ సీక్వెన్స్సెస్" అంటారు. ఇవి సాధారణంగా రెండు "కోడింగ్ సీక్వెన్స్" (ప్రోటీన్లను ఉత్పత్తి చేసే క్రమాలు) ల మధ్యలో ఉంటాయి. తరువాత 1970లో జరిగిన పరిశోధనలలో ఈ నాన్ కోడింగ్ సీక్వెన్స్సెస్ రెండు కోడింగ్ సీక్వెన్స్ ల మధ్యలోనే కాకుండా కొన్ని కోడింగ్ సీక్వెన్స్ ల లోపల కూడా ఉంటాయని తేలింది. వీటిని "ఇన్ట్రాన్లు" అని పిలుస్తారు. మనిషి కణాల్లోని డీ. ఎన్. ఏ. లో కేవలం 5 శాతం మాత్రమె ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుందనేది ఒక అంచనా