అంశం 32 జన్యువులు ఒక చోటినుండి ఇంకో చోటికి దూకుతాయి..
క్రోమోసోమ్ అనే దారం మీద ఎక్కించిన పూసలు జన్యువులు అని థామస్ హంట్ మార్గన్ చాటిన భావన 20 వ శతబ్దపు మొదటి భాగంలో పెద్దగా మారలేదు. క్రోమోసోమ్ ల మీద మారని స్థానాలు గల స్థిర వస్తువులు జన్యువులు అని నమ్మేవారు. కాని 1950 లలో బార్బరా మక్ క్లింటాక్ (Barbara McClintock) అనే శాస్త్రవేత్త ఒక విప్లవాత్మకమైన విషయాన్ని కనుక్కుంది. కొన్ని డీ. ఎన్. ఏ. శకలాలు క్రోమోసోమ్ లో ఒక చోటి నుండి మరో చోటికి 'స్థానచలనం' (transpose) చెందుతాయని, గంతు వేస్తాయని, ఈమె కనుక్కున్నారు. అలాంటి డీ.ఎన్. ఏ. శకలాలకి transposons అని పేరు. ఈ రకమైన స్థానచలనం (transposition) వల్ల డీ. ఎన్. ఏ. శకలాలు అటు ఇటు మారి పర్యావరణం నుండి వచ్చే ఒత్తిళ్లకి తట్టుకునేలా కొన్ని జన్యువుల సృష్టి సాధ్యమవుతుందని ఆమె ప్రతిపాదించారు.
సాంప్రదాయక చింతనను వ్యతిరేకించిన కారణంగా మాత్రమే కాక, కేవలం క్రోమోసోమ్ ల మధ్య సంకరణాలకి చెందిన పరిశీలనల మీద ఆధారపడి ఊహించిన సిద్ధాంతం కావడంతో, జన్యు శాస్త్ర చరిత్రలో బార్బరా మక్ క్లింటాక్ కృషి గణనీయం అని చెప్పుకోవచ్చు. ఆమె భావాలని నిర్ధారించడం కోసం ఆధునిక డీ. ఎన్. ఏ. విశ్లేషణా పరికరాలు అభివృద్ధి చెందినంతవరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ఆమె కృషి క్రోమోసోమ్ లు సంచలిత, మార్పుకు లోనయ్యే, నిర్మాణాలు అన్న ఆధునిక భావానికి పునాది వేసింది.