అంశం 35 కణం బయటి నుండి వచ్చే సంకేతాలకి డీ. ఎన్. ఏ. స్పందిస్తుంది.
శరీరం యొక్క వృద్ధి, వికాసం జరగాలంటే కణాలు ఒక దాంతో ఒకటి సంభాషించుకోవాలి. శరీరంలో ఇతర భాగాల నుండి వచ్చే సంకేతాలకి అవి స్పందించాలి. గ్రంథుల నుండి వెలువడే హార్మోన్లు శరీరం అంతా ప్రయాణించి కొన్ని ప్రత్యేక కణజాతుల వృద్ధిని కలుగజేస్తాయి. ఒక ప్రత్యేక హార్మోన్ కి ఓ కణం స్పందించింది అంటే, ఆ కణం యొక్క పొరలో ఆ హార్మోన్ కి సంధానం కాగల రిసెప్టారు ఉందన్నమాట. హార్మోను దాని రిసెప్టారుతో సంధానం అయినప్పుడు వరుసగా కొన్ని అణు పరివర్తనలు జరుగుతాయి. సంకేతాన్వయం (signal transduction) అనబడే ఈ చర్యలే కణ వృద్ధికి కారణమైన సంకేతాన్ని కణం లోపలికి చేరవేస్తుంది.
మొదటగా కణ పొరని చేరిన సంకేతాన్ని రిసెప్టారు అన్వయించి ఆ సంకేతాన్ని పొర లోపలి వైపునకు చేరవేస్తుంది. అక్కడ అది ప్రోటీన్ "వార్తాహరుల"ని ప్రేరేపిస్తుంది. ఈ వార్తాహరులు కణం లోపల జరిగే రసాయనిక పరంపరలో భాగాలు. ఈ చర్యలలో తరచు ఫాస్ఫేట్ గుంపులని జత చెయ్యడం జరుగుతుంది. అలా కణంలోకి వచ్చిన సంకేతం సైటోప్లాసమ్ లోకి, అక్కణ్ణుంచి న్యూక్లియస్ లోకి ప్రవేశిస్తుంది. ఇక సంకేతాన్వయంలో చివరి భాగంగా డీ.ఎన్. ఏ. కి సంధానమయ్యే ప్రోటీన్లు డీ.ఎన్. ఏ. ద్విగుణీకరణ, లేదా అనులేఖనం మొదలైన ప్రక్రియలకి దారితీస్తాయి.