అంశం 38 దేహవికాసంలో కణవృద్ధికి, కణమరణానికి మధ్య సమతూనిక ఏర్పడుతుంది.
జీవశాస్త్రపరంగా గమనిస్తే ఉన్న కణాలు విభజన (mitosis) చెంది కొత్త కణాలు పునరుత్పత్తి చెందడం వల్ల ఎదుగుదల ఏర్పడుతుంది. ఒక ధాతువు గాని, అంగం గాని ఒక నియత పరిమాణాన్ని చేరుకున్నప్పుడు మైటాసిస్ నెమ్మదిస్తుంది. కణం విరామ దశని (resting phase) చేరుకుంటుంది. కణం యొక్క ఈ వృద్ధి, విరామ దశలని కొన్ని "చెక్ పాయింట్" అణువులు నిర్దేశిస్తాయి. ఈ అణువులని 1980, 1990 లలో మొదట్లో యీస్ట్ కణాలలోను, తదనంతరం యూకార్యోట్ లలోను కనుక్కున్నారు.
ఒక విచిత్రమైన విషయం ఏంటంటే సామాన్య దేహవికాస క్రమంలో భాగంగా కొన్ని ఆరోగ్యవంతమైన కణాలని తొలగించవలసి వస్తుంది, చంపవలసి వస్తుంది. ఈ ప్రక్రియనే 'అపటోసిస్' (apoptosis) అంటారు. ఈ అపటోసిస్ యొక్క లక్షణానికి చెందిన మొదటి సూచనలు సి. ఎలిగాన్స్ (C. Elegans) అనే క్రిమి మీద జరిపిన అధ్యయనాల వల్ల దొరికాయి. ఈ క్రిమిలో ఎదిగిన దశలో ఉండే 959 కణాలలోని ప్రతి వొక్క కణం యొక్క చరిత్రని ఫలదీకృత అండం దశ నుండి వర్ణించడానికి సాధ్యమయ్యింది. కణాల యొక్క "జాతకాల"ని పరిశీస్తే పిండవికాస క్రమంలో ప్రత్యేక కణాలు ప్రత్యేక సమయాలలో మరణించేట్టుగా ముందే 'ప్రోగ్రాం' చెయ్యబడినట్టు తెలిసింది. ఆ ప్రోగ్రాంలో వచ్చే అవాంఛనీయ మార్పుల వల్ల కణాలు అతిగా ఉత్పత్తి కావచ్చు. అలాంటి స్థితినే కాన్సర్ అంటారు.