అంశం 39 సంపూర్ణ జన్యు కూటమిని జీనోమ్ అంటారు.
ప్రతీ ప్రాణిలోను ఆ ప్రాణికి చెందిన మొత్తం జన్యు సమాచారం అంతా కొన్ని ప్రత్యేక క్రోమోసోమ్ లలో పొందుపరచబడి వుంటుంది. ఉదాహరణకి మానవ జీనోమ్ లో ఉండే జన్యు సమాచారం అంతా ప్రతీ కణంలోను ఉండే న్యూక్లియస్ లో 46 క్రోమోసోమ్ లలో పొందుపరచబడి వుంటుంది. ఈ క్రోమోసోమ్ లు 23 జతలుగా ఏర్పడి వుంటాయి. ప్రతీ జతలోను ఒక క్రోమోసోమ్ తల్లి నుండి, రెండవది తండ్రి నుండి సంక్రమిస్తుంది. ఒక ప్రత్యేక క్రోమోసోమ్ ల జత ( X మరియు Y క్రోమోసోమ్లు) వల్ల ఆ ప్రాణి యొక్క లింగనిర్ధారణ జరుగుతుంది. ఇక మిగతా 22 క్రోమోసోమ్ ల జతలని ఆటోసోమ్ లు (autosomes) అంటారు.
మానవ జీనోమ్ లో ఉండేవి అత్యంత పొడవైన డీ.ఎన్. ఏ. అణువులు. ఒక క్రోమోసోమ్ లో ఒక డీ.ఎన్. ఏ. అణువు ఉంటుంది. ఈ అణువులలో 35,000 జన్యువులు పొందుపరచబడి వుంటాయని అంచనా. ఈ మొత్తం డీ.ఎన్. ఏ. అణువులలోను ఉండే న్యూక్లియోటైడ్ శ్రేణిని తెలుసుకోవడనే 'మానవ జీనోమ్ ప్రాజెక్ట్' (Human Genome Project) యొక్క లక్ష్యం. డీ.ఎన్. ఏ. లోని శ్రేణి ని తెలుసుకునే యంత్రాల మీద, ఆ శ్రేణి లో ప్రత్యేక జన్యువుల కోసం వెతకగలిగే కంప్యూటర్ ప్రోగ్రామ్ ల మీద మానవ జీనోమ్ ప్రాజెక్ట్ పూర్తిగా ఆధారపడింది. మానవ జీనోమ్ లోని డీ.ఎన్. ఏ. శ్రేణి యొక్క "ప్రథమ వర్ణన" జూన్ 2000 కల్లా పూర్తయ్యింది. ఆ సమాచారం యొక్క ప్రథమ విశ్లేషణా ఫలితాలు ఫిబ్రవరి 2001 లో ప్రచురితం అయ్యాయి.