అంశం 40 జీవరాశులలో ఎన్నో సమాన జన్యువులు ఉంటాయి.

Living things share common genes.

జీవరాశులు అన్నిట్లోను జన్యు సమాచారం ఒకే రకం అణువులలో పొందుపరచబడి వుంటుంది. ఆ అణువులే – డీ.ఎన్. ఏ. మరియు ఆర్. ఎన్. ఏ. లు. ఈ రహస్య జన్యు సందేశాలలో జీవ రాశుల సుదీర్ఘ సామాన్య చరిత్రకి ఆనవాళ్ళు అనదగ్గ ఎన్నో విషయాలు దాగి వున్నాయి. ఉన్నత జీవాకృతుల పరిణామం జరగాలంటే కొత్త ఆకారాలని రూపొందించగల కొత్త జన్యువులు వికాసం చెందాలి, కొత్త పోషక పదార్థాలు కూడా లభ్యం కావాలి. ఆ విషయం అలా వున్నా, సంక్లిష్టమైన జీవాలలో కూడా కీలక జీవరసాయన చర్యలని శాసించే జన్యువులు జీవరాశుల పురాతన గతం నుండి సంక్రమించినవే.

ఒక ప్రాణి యొక్క పరిణామ క్రమంలో కొన్ని జన్యువులు మారకుండా వస్తాయి. అలాగే జీవరాశుల మధ్య జన్యువుల వినియమం గాని, ఒక జీవరాశి నుండి మరో జీవరాశి జన్యువులని "దొంగలించడం" గాని జరుగుతుంది. ఆంటీబయాటిక్ నిరోధకత గల జన్యువులు ఉన్న ప్లాస్మిడ్ లని బాక్టీరియాలు ఇచ్చిపుచ్చుకోగలవు. అలాగే వైరస్ లు వాటి జన్యువులని ఇతర కణాలలోకి చొప్పించగలవు. స్తన్యజీవులకి చెందిన కొన్ని జన్యువులని వైరస్ లు పరిగ్రహించి ఇతర స్తన్యజీవుల కణాలోకి చొప్పించగలవు. ఒక జీవరాశి ఒక జన్యువుని ఎలా సంపాదించినా, ఎలా నిలుపుకున్నా, ఒక ప్రోటీన్ సరిగ్గా పని చెయ్యడానికి కావలసిన జన్యు ప్రాంతాలు మాత్రం చెక్కుచెదరకుండా ఉంటాయి. కొన్ని అప్రధానమైన ప్రాంతాలలో మాత్రం ఉత్పరివర్తనల వల్ల మార్పులు పేరుకోవచ్చు. ఈ ఉత్పరివర్తనలే ఒక జన్యువు యొక్క పరిణామాత్మక జీవన చరిత్రని నిర్వచిస్తాయి.