అంశం 11క్రోమోసోమ్ ల మధ్య విభాగాల వినియమం జరిగినప్పుడు జన్యువులు తారుమారు అవుతాయి
ఫ్రూట్ ఫ్లై లలో ఇంకా ఇంకా అనువంశిక లక్షణాలని కనుక్కున్న థామస్ మార్గన్ తదితరులు, ఒక విషయం గమనించారు. ఎప్పుడూ కొన్ని లక్షణాలు కలిసికట్టుగా సంక్రమిస్తాయని వాళ్లు గుర్తించారు. దీన్ని బట్టి జన్యువులకి మధ్య 'లంకె'లు ఉంటాయని, కొన్ని జన్యువులు సమిష్టిగానే సంక్రమిస్తాయని ఆలోచించడం మొదలెట్టారు. అలాంటి నాలుగు జన్యు కూటములని లేదా "లంకె గుంపుల"ని గుర్తించారు. ఈ నాలుగు అన్న సంఖ్య, మైక్రోస్కోప్ లో చూసినప్పుడు కనిపించే నాలుగు క్రోమోసోమ్ల సంఖ్యతో సరిపోతోంది. జన్యువులు క్రోమోసోమ్ ల మీద ఉంటాయని అనడానికి ఇది అదనపు నిదర్శనం అయ్యింది. జన్యువుల మధ్య లంకెలు ఉంటాయన్న భావనని ఆధారంగా చేసుకుని థామస్ మార్గన్ యొక్క శాస్త్ర బృందం ఫ్రూట్ ఫ్లై క్రోమోసోమ్ లకి మ్యాపులు నిర్మించింది. సమజాతీయ (homologous) క్రోమోసోమ్ ల మధ్య విభాగాల వినియమం జరిగినప్పుడు లంకెలు ఉన్న జన్యువులు కూడా ఒక్కొక్కసారి మియాసిస్ లో వేరుపడిపోతాయని వాళ్లు గమనించారు. అలా జన్యువులు ఎంత తరచుగా వేరు పడతాయన్నది క్రోమోసోమ్ ల మీద వాటి మధ్య దూరం మీద ఆధారపడుతుంది. దూరం ఎక్కువ అవుతున్న కొద్ది జన్యువులు మరింత సులభంగా వేరుపడతాయి. దగ్గర దగ్గరగా ఉండే జన్యువులు అరుదుగానే వేరుపడతాయి. అలా వేరు పడ్డ జన్యువులు కొత్త గుంపులుగా ఏర్పడతాయి. దీనినే పునస్సంయోగం (recombination) అంటారు.