అంశం 9లింగ నిర్ధారణకు ప్రత్యేక క్రోమోజోములు ఉంటాయి.
పూర్వం ప్రాణి యొక్క లింగం ఎలా నిర్ధారించబడుతుందనే విషయం గురించి చాలా అపోహలుండేవి. ఐతే 1905వ సంవత్సరంలో కణాల్లో జరిగే "మియాసిస్" (meiosis) అనే కణ విభజన ప్రక్రియ పై జరిగిన పరిశోధనల ద్వారా క్రోమోజోములు పిల్లల లింగాన్ని ఎలా నియంత్రిస్తాయో అర్ధమయింది.
మియాసిస్ జరుగుతున్నప్పుడు క్రోమోజోములు 23 జతలుగా ఏర్పడతాయి. ప్రతి జతలో ఒకటి తల్లి నుండి మరొకటి తండ్రినుండి సంక్రమించిన క్రోమోజోములుంటాయి. అయితే పురుషులలో మాత్రం ఈ 23 జతలలో ఒక జత భిన్నంగా ఉండడాన్ని గమనించారు శాస్త్రవేత్తలు . ఈ జతలో ఒక క్రోమోజోము పెద్దగా ఇంకొకటి చిన్నగా ఉంటాయి. ఈ జతలో పెద్ద క్రోమోజోముని "X" క్రోమోజోమని, చిన్నదానిని "Y" క్రోమోజోమని అంటారు. అయితే స్త్రీలలో మాత్రం ఈ జతలో రెండూ "X" క్రోమోజోములే ఉంటాయి. అంటే "XX" జత ఉంటే ఆడపిల్ల "XY" జత ఉంటే మగ పిల్లవాడు పుడతారు. తల్లి నుండి వచ్చే ఆండాలలో "X" క్రోమోజోములు మాత్రమే ఉంటాయి. తండ్రి నుండి వచ్చే శుక్ర కణాల్లో "X" లేదా "Y" క్రోమోజోములు ఉండవచ్చు. అంటే శిశువు ఆడదా మగదా అనేది తండ్రి నుండి వచ్చే శుక్ర కణాల మీద ఆధారపడి ఉంటుందనమాట.