అంశం 33 జన్యువులని 'ఆన్' చేసి 'ఆఫ్' చెయ్యడానికి వీలవుతుంది.
1950, 1960 ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు జన్యువుల అణు నిర్మాణాన్ని కనుక్కుని, జెనెటిక్ కోడ్ ని ఛేదించే ప్రయత్నంలో ఉన్నారు. జన్యువులన్నీ కొన్ని పథకాల కూటమిగా వాళ్లు గుర్తించారు. అంటే ఒక్కొక్క ప్రోటీన్ నిర్మాణానికి దానికి సంబంధించిన జన్యువు ఒక పథకం లాంటిది అన్నమాట. కాని జన్యువులు ఎప్పుడూ ప్రోటీన్లని తయారు చెయ్యవు. జన్యువులు వ్యక్తీకరింప బడతాయా లేదా అన్నది కొన్ని కారణాల మీద ఆధారపడుతుంది. బాక్టీరియాలలో జన్యు నియంత్రణ (gene regulation) మీద మొట్టమొదటి ఫలితాలు సాధించిన వారు ఫ్రెంచి శాస్త్రవేత్తలు.
లాక్టోస్ (lactose) లభ్యమై వున్నప్పుడు ఈ. కోలై (E. Coli) లో ఒక ప్రత్యేక జన్యు కూటమి 'ఆన్' అవుతుంది. ఈ జన్యువులే చక్కెర యొక్క metabolism ని నియంత్రిస్తాయి. లాక్టోస్ ఆరంభించిన సంఘటనల వరుసక్రమాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించి, లాక్టోస్ డీ.ఎన్. ఏ. నుండి ఓ ఇన్హిబిటర్ (inhibitor) ను తొలగిస్తుంది అని కనుక్కున్నారు. ఇన్హిబిటర్ ని తొలగించడం వల్ల ప్రోటీన్ తయారీ ఆరంభమవుతుంది.
ఇన్హిబిటర్ ని తొలగించే జన్యువు ఒక నియంత్రణా జన్యువు (regulatory gene). ఈ జన్యువుని కనుక్కోవడంతో ఉన్నత జీవాలలో దేహ వికాస క్రమాన్ని(body development) గురించిన అవగాహన పూర్తిగా మారిపోయింది. అంటే కణాలలోని డీ. ఎన్. ఏ. లో రూపాత్మక ప్రోటీన్ల నిర్మాణానికి కావలసిన జన్యు పథకాలు మాత్రమే కాదు, ఆ పథకాలని వ్యక్తం చెయ్యడానికి తగిన జన్యు నియంత్రణా ప్రణాళిక కూడా ఆ డీ. ఎన్. ఏ. లో పొందుపరచబడి వుంది.