అంశం 34 జన్యువులని ఒక ప్రాణి నుండి మరో ప్రాణికి మార్చుకోవచ్చు.
జెనెటిక్ కోడ్ విశ్వజనీనం కనుక ఒక ప్రాణి నుండి వచ్చిన పాలిమరేస్ లు మరో ప్రాణి నుండి వచ్చిన జీన్ ని కచ్చితంగా అనులిఖించగలవు (transcribe చెయ్యగలవు). ఉదాహరణకి కొన్ని ప్రత్యేక బాక్టీరియా జాతులు ప్లాస్మిడ్లు అనబడే చిన్నపాటి క్రోమోసోమ్ లని తమ మధ్య తాము ఇచ్చిపుచ్చుకుంటూ, తమలో ఆంటీబయాటిక్ ల నుండి నిరోధకతను పెంచుకుంటాయి. 1970 లలో కాలిఫోర్నియాకి చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఈ రకమైన జన్యు వినియమాన్ని వాడుకుంటూ ఈ "రీకాంబినంట్" (recombinant) డీ.ఎన్. ఏ. ని ఒక ప్రాణి నుండి మరో ప్రాణిలోకి మార్చగలిగారు. 1980 లలో తొలి దశల కల్లా ఇతర శాస్త్రవేత్తలు ఈ పద్ధతికి కాస్త సవరించుకుని, ఈ. కోలై లోకి మానవ జీన్ ని ప్రవేశపెట్టి, రీకాంబినంట్ పద్ధతి ద్వార మానవ ఇన్సులిన్ (human insulin) ని, వృద్ధి హార్మోన్ (growth hormone) ని ఉత్పత్తి చెయ్యగలిగారు.
రీకాంబినంట్ డీ. ఎన్. ఏ. టెక్నాలజీ, జెనెటిక్ ఇంజినీరింగ్ – ఈ సాంకేతిక విభాగాల వల్ల జన్యువులు ఎలా పని చేస్తాయో తెలుసుకోడానికి వీలయ్యింది. జంతు నమూనాల ద్వార జన్యు క్రియలని పరీక్షించడం ఆచరణీయం కానప్పుడు జన్యువులని ముందు బాక్టీరియాలలో గాని, కణ సందోహాలలో గాని వ్యక్తం చెయ్యొచ్చు. అదే విధంగా జన్యు ఉత్పరివర్తనల యొక్క వ్యక్త రూపాలని (phenotypes), మందుల యొక్క ఫలదాయకతని రీకాంబినంట్ వ్యవస్థల సహాయంతో పరీక్షించవచ్చు.