అంశం 37 ప్రాథమిక దేహవ్యూహాన్ని (body plan) కొన్ని ప్రధాన జన్యువులు (master genes) నిర్దేశిస్తాయి.
ఫలదీకృత అండం, పిండం, బాల్యం, యవ్వనం, ప్రౌఢత్వం, వార్ధక్యం – మొదలుగా దశలవారీగా జరిగే శరీర వికాస క్రమం సాధ్యం కావాలంటే ప్రత్యేక సమయాలలో, ప్రత్యేక ప్రదేశాలలో, ప్రత్యేక జన్యువుల వ్యక్తీకరణ క్రమబద్ధంగా జరగాల్సి ఉంటుంది. డ్రొసాఫిలా (Drosophila, fruitfly) అనే ఒక రకమైన సామాన్యమైన ఈగలో జరిగే కొన్ని విడ్డూరమైన ఉత్పరివర్తనలకి (mutations) సంబంధించిన అధ్యయనాల వల్ల, అణు స్థాయిలో జరిగే చర్యలు విస్తృత స్థాయిలో దేహవ్యూహాన్ని ఎలా నిర్దేశిస్తాయో తెలిసింది. తొలిదశలలో పిండంలో వ్యక్తమయ్యే జన్యువులు కొన్ని ప్రత్యేక ప్రోటీన్లని ఉత్పత్తి చేస్తాయి. "హోమియోటిక్" (homeotic) జన్యువులు వివిధ దేహ భాగాల మీద పని చేస్తూ, ఒక్కొక్క భాగాన్ని ఒక ప్రత్యేకమైన తీరులో మలుస్తాయి.
ఈ హోమియోటిక్ జన్యువుల మీద జరిపిన 'శ్రేణీ విశ్లేషణ' (sequence analysis) బట్టి డ్రొసాఫిలా కి, కశేరుకాలకి (vertebrate) మధ్య ఒక ప్రత్యేక 180 - న్యూక్లియోటైడ్ క్రమం సమానంగా ఉంటుందని తెలిసింది. ఈ న్యూక్లియోటైడ్ క్రమాన్నే హోమియోబాక్స్ (homeobox) అంటారు. ఈ హోమియోబాక్స్ ప్రోటీన్లకి, డీ.ఎన్. ఏ. ప్రొమోటర్లకి, ఎన్హాన్సర్లకి సంధానం అయ్యే నియంత్రక ప్రోటీన్లకి (regulatory proteins) మధ్య ఎన్నో పోలికలు ఉన్నట్టు తేలింది. హోమియోటిక్ ప్రోటీను కొన్ని ప్రత్యేక ప్రొమోటర్, ఎన్హాన్సర్ శ్రేణులకి తగులుకున్నప్పుడు, ఆ శ్రేణి ఎన్నో జన్యువులలో సమానంగా ఉంటుంది కనుక, హోమియోటిక్ ప్రోటీన్ ఎన్నో జన్యువుల మీద ప్రభావం చూపించగలుగుతుంది. ఆ జన్యువులే దేహవ్యూహాన్ని శాసిస్తాయి.