అంశం 36 వివిధ రకాల కణాలలో వివిధ జన్యువులు సక్రియంగా ఉంటాయి
ప్రాణులలో ఎన్నో రకాల కణాలు ఉంటాయి. ఒక్కొక్క కణ జాతికి కొన్ని ప్రత్యేక క్రియలు ఉంటాయి. ఒక కాలేయపు (liver) కణానికి, ఓ నడీ కణానికి (neuron) మధ్య జీవరసాయనిక చర్యలలో తేడాలు ఉంటాయి. కాని మరి ఒక ప్రాణిలో ఉండే ప్రతీ కణంలోను జన్యుపరమైన ఆదేశాలు సమానంగా ఉంటాయి. మరి అలాంటప్పుడు వివిధ కణ జాతులలో రూపంలోను, జీవరసాయనిక క్రియలలోను వైవిధ్యం ఎలా వస్తుంది? జీవరసాయనిక క్రియ అనేది ప్రత్యేక ఎన్జైమ్ ల చేత నిర్దేశింపబడుతుంది కనుక, వివిధ కణ జాతులలో వివిధ జన్యు సముదాయాలు సక్రియంగానో (ON), నిష్క్రియంగానో (OFF) ఉంటాయన్నమాట.
ప్రతీ కణంలోను ఆ కణానికి ప్రత్యేకమైన జన్యు వ్యక్తీకరణ (gene expression) జరుగుతుంది అన్న భావనని, ఆ కణంలో ప్రత్యేకంగా కనిపించే mRNA అణువులని కనిపెట్టగల hybridization ప్రయోగాలు సమర్ధిస్తాయి. ఇటీవలి కాలంలో జీన్ అరేలు (gene array), జీన్ చిప్ (gene chip) లు ఒక ప్రాణిలో వ్యక్తమయ్యే మొత్తం జన్యు సముదాయాన్ని వేగంగా పరిశీలించగలుగుతున్నాయి. ఆ విధంగా బాహ్య కారణాల వల్ల జరిగే జన్యు సహవ్యక్తీకరణ (co-expression of genes) ని గుర్తించి, పరీక్షించడానికి సాధ్యం అవుతోంది.