అంశం 1 పిల్లలకి తమ తల్లిదండ్రుల పోలికలు వస్తాయి.
మానవ జాతి ఆరంభం అయిన నాటి నుండి ఒక తరం నుండి తదుపరి తరానికి లక్షణాలు ఎలా సంక్రమిస్తాయి అని మనుషులు ఆలోచించసాగారు. కొందరి పిల్లల్లో ప్రత్యేకంగా తండ్రి పోలికో, తల్లి పోలికో బలంగా ఉండొచ్చు. కాని ఎక్కువగా పిల్లల్లో తమ తల్లిదండ్రుల ఇద్దరి పోలికలు కలుస్తాయి. మొక్కల మధ్య సంకరాన్ని గాని, జంతువుల మధ్య కలయికని గాని కొన్ని ప్రత్యేక రీతుల్లో నియంత్రిస్తే తదుపరి తరంలో మరింత సమర్ధవంతమైన మొక్కలని, జంతువులని సాధించవచ్చని మొక్కల, జంతువుల పెంపకంలో మనిషి తాను సాధించిన శతాబ్దాల అనుభవం ఆధారంగా తెలుసుకున్నాడు. ఈ విధంగా నియంత్రించబడ్డ సంపర్కం చేత మరింత వేగంగా దౌడు తీయగల గుర్రాలని, మరింత ఎక్కువ పాలు ఇవ్వగల పాడియావులని, లేదా మరిన్ని పళ్ళు ఇవ్వగల చెట్లని సాధించడానికి వీలయ్యింది. కాని ఒక ఆడ జీవి, ఒక మగ జీవి యొక్క కలయిక వల్ల కచ్చితంగా ఎలాంటి సంతతి పుడుతుందో తెలుసుకోడానికి శాస్త్రీయమైన పద్ధతులు ఏవీ లేవు. ఇలా వుండగా 1865 లో గ్రెగర్ మెండెల్ అనే ఓ సాధువు మొక్కల మీద కొన్ని ముఖ్యమైన ప్రయోగాలు చేశాడు. ఒక తరం నుండి తదుపరి తరానికి లక్షణాలు చేరవేసే కొన్ని నిర్దిష్టమైన "కారకాలు" (factors) ఉన్నాయని తన ప్రయోగాల సహాయంతో కనుక్కున్నాడు. ఆ కారకాలకి జన్యువులు (genes) అని పేరు పెట్టాడు. అతడి వైజ్ఞానిక ప్రయోగాల వల్ల కేవలం అనుభవం మీద చేసే ఓ మోటు ప్రక్రియగా ఉండే మొక్కల పెంపకం శాస్త్రీయ హోదాని సంతరించుకుంది. తెలిసిన జన్యు నేపథ్యం (genetic background) గల జనక మొక్కలతో తన ప్రయోగాలు మొదలెట్టాడు. తదుపరి తరాలలో వచ్చే మార్పులని పోల్చడానికి ఆ ప్రథమ తరం ఓ ప్రమాణంలా ఉంటుంది. అక్కణ్ణుంచి ఒక్కొక్క తరంలోను మొక్కల్లో వివిధ లక్షణాలు ఏ విధంగా మారుతాయో పరిమాణాత్మకంగా విశ్లేషించాడు.