అంశం 16 ఒక జీన్ నుండి ఒక ప్రోటీన్ తయారు అవుతుంది.
1902 లో ఆర్చిబాల్డ్ గారడ్ (Archibald Garrod) అనే శాస్త్రవేత్త అల్కాప్టొనూరియా (alcaptonuria) అనే అనువంశిక వ్యాధిని "జీవరసాయనిక క్రియలలో జన్మతః వచ్చిన దోషం" వల్ల వచ్చిన వ్యాధిగా అభివర్ణించాడు. మన శరీరంలో ద్రవ రూపంలో ఉండే వ్యర్థాలని వెలువరించే ప్రక్రియలని ఓ జీవరసాయన క్రియ (biochemical pathway) శాసిస్తుంది. ఒక జీన్ లో కలిగిన ఉత్పరివర్తన (mutation) వల్ల ఈ జీవరసాయన క్రియ దెబ్బతింటుంది అని సూచించాడు గారడ్. ఆ దోషమే ఈ వ్యాధి యొక్క దృశ్య రూపంలో (phenotype) నల్లని మూత్రంగా అభివ్యక్తమవుతుంది.
ఈ ప్రతిపాదనను 1941 లో జార్జ్ బీడిల్ (George Beadle) మరియు ఎడ్వర్డ్ టాటమ్ (Edward Tatum) లు నిర్ద్వంద్వంగా నిరూపించారు. వారి ప్రయోగాలలో వారు సామాన్యంగా బ్రెడ్ మీద పట్టే బూజుని వినియోగించారు. ఆ బూజుని న్యూరో స్పోరా అంటారు. మొట్టమొదటగా వారు వికిరణాల ప్రభావానికి లోనైన బూజు ముఖ్యమైన పోషక పదార్థాలని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోతుందని గుర్తించారు. ఆ కారణం చేత బూజు వృద్ధి చెందే వేగం మందగించడమే కాక అసలు వృద్ధి ఆగిపోయింది. కాని అలా ఉత్పరివర్తన చెందిన బూజుకి ఒక ప్రత్యేక రసాయనాన్ని కలిపితే ఆగిపోయిన వృద్ధి తిరిగి పుంజుకోవడం గమనించారు. ప్రతీ ఉత్పరివర్తన పోషక పదార్థాల ఉత్పత్తికి అవసరమైన ఏదో ఎన్జైమ్ ని నిష్క్రియం (inactivate) చేస్తోందని ప్రయోగకారులు ఊహించారు. ఆ విధంగా ఒక జీన్ ఒక ప్రోటీన్ యొక్క ఉత్పత్తికి కావలసిన ఆదేశాలు కలిగి వుంటుందని తెలిసింది.