అంశం 22 డీ.ఎన్. ఏ. భాషలో పదానికి మూడు అక్షరాలు ఉంటాయి.

DNA words are three letters long.

డీ.ఎన్. ఏ. లో ఉండే A, T, G, C అణువులనే అక్షరాలతో కూర్చబడ్డ భాషనే "జెనెటిక్ కోడ్" (genetic code) అంటారు. ఆ అక్షరాలతో ఎన్నో పదాలు కూర్చబడతాయి. ఒక్కొక్క పదం మనకి తెలిసిన 20 అమినో ఆసిడ్లలో ఒక దానికి సంకేతం. పదానికి రెండు అక్షరాలు మాత్రమే ఉన్నట్లయితే, మొత్తం నాలుగు అక్షరాలు ఉన్నాయి కనుక, (4x4= 16) విభిన్న పదాలు మాత్రమే సాధ్యం అవుతాయి. అట్లా కాకుండా పదానికి మూడు అక్షరాలు ఉన్నట్లయితే మొత్తం (4x4x4=64) విభిన్న పదాలు సాధ్యం అవుతాయి. పరిష్కారం ఎంత సరళంగా ఉంటే అది నిజం అయ్యే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది అనే తర్కాన్ని వినియోగించి జెనెటీక్ కోడ్ లో ఉండేవి మూడు అక్షరాల పదాలు అని శాస్త్రవేత్తలు ఊహించారు. అలాంటి మూడక్షరాల పదాలని 'కోడాన్' (codon) లని పిలిచారు.

యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ – ఈ సంస్థలకి చెందిన శాస్త్రవేత్తల బృందాలు ఎంతో ప్రయాస పడి వివిధ ఆర్. ఎన్. ఏ. అణువులని సంయోజించాయి. ఈ అణువులలో ఒకే కోడాన్ పదే పదే మాలలో సుమాలలా ఆవృత్తమవుతుంది. అలా సంయోజింపబడ్డ కృత్రిమ ఆర్. ఎన్. ఏ. అణువులని వేరు వేరుగా రైబోసోమ్ లు, ట్రాన్స్ఫర్ ఆర్. ఎన్. ఏ. లు, అమినో ఆసిడ్లు ఉన్న, కణరహితమైన వ్యవస్థలో ప్రవేశపెట్టారు. అనుకున్నట్లుగా ఒక్కొక్క సంయోజిత ఆర్. ఎన్. ఏ. నుండి ఒకే అమినో ఆసిడ్ గల పాలిపెప్టైడ్ గొలుసులు ఉత్పన్నమయ్యాయి. పలు కోడాన్లు ఒకే అమినో ఆసిడ్ ని సూచించగలవు. అందుచేతనే కోడాన్లు 64 ఉన్నా అమినో ఆసిడ్లు 20 మాత్రమే వున్నాయి. అయితే అన్ని కోడాన్లు అమినో ఆసిడ్లని సూచించవు. కొన్ని కోడాన్లు "ఆగు" అనే సందేశానికి సంకేతాలు.