అంశం 19 డీ.ఎన్. ఏ. అణువు మెలిక తిప్పిన నిచ్చెనలా ఉంటుంది.

The DNA molecule is shaped like a twisted ladder.

ఇంతవరకు జరిగిన వైజ్ఞానిక కృషి వల్ల డీ.ఎన్. ఏ. అణువుకి న్యూక్లియోటైడ్ లు అనే అణువులు పునాదిరాళ్లు అని తెలిసింది. ప్రతీ న్యూక్లియోటైడ్ లోను ఒక డీయాక్సీ రైబోస్ షుగర్ అణువు, ఒక ఫాస్ఫేట్ సముదాయం (group), ఇవి గాక అడెనిన్ (A), థైమిన్ (T), గువనిన్ (G), సైటొసిన్ (C) అనే నాలుగు నైట్రోజెన్ బేస్ లలో ఒకటి ఉంటాయి. పక్క పక్కనే ఉండే న్యూక్లియోటైడ్ ల మధ్య ఫాస్ఫేట్, షుగర్ ల మధ్య బంధాలు ఏర్పడడం వల్ల న్యూక్లియోటైడ్ లు గొలుసుకట్టుగా ఏర్పడి పాలిమర్ అణువు అవుతాయి. ఇతర కీలక ప్రయోగాల వల్ల డీ.ఎన్. ఏ. లో A కి T కి మధ్య నిష్పత్తి, అలాగే G కి C కి మధ్య నిష్పత్తి జీవపదార్థంలో ఎక్కడ చూసినా ఒకేలా ఉంటుంది అన్న విషయం బయటపడింది. చిట్టచివరికి ఎక్స్-రే క్రిస్టలోగ్రఫీ (x-ray crystallography) వల్ల డీ.ఎన్. ఏ. అణువు మెలిక తిప్పిన నిచ్చెనలా డబుల్ హెలిక్స్ ఆకారంలో ఉంటుందని తెలిసింది.

1953 లో ఇంగ్లండ్ లో కేంబ్రిడ్జ్ లోని కావెండిష్ ప్రయోగశాలకి చెందిన జేమ్స్ వాట్సన్ (James Watson) మరియు ఫ్రాన్సిస్ క్రిక్ (Francis Crick) లు కలిసి డీ.ఎన్. ఏ. అణువు యొక్క త్రిమితీయ అణువిన్యాసాన్ని ఛేదించారు. డీయాక్సీ రైబోస్ మరియు ఫాస్ఫేట్ అణువులు మారి మారి రావడం వల్ల నిచ్చెన లాంటి డీ.ఎన్. ఏ. అణువు మెలిక తిరుగుతోందని గుర్తించారు. పరిపూరకాలైన నైట్రోజెన్ బేస్ ల జత లు ఆ నిచ్చెనలోని మెట్లు. ఈ జతలలో A ఎప్పుడూ T తోను, G ఎప్పుడూ C తోను కలుస్తుంది.