అంశం 41 మావన జీనోమ్ ని అర్థం చేసుకునే ప్రయత్నంలో డీ. ఎన్. ఏ. ఓ తొలిమెట్టు మాత్రమే.
డీ.ఎన్. ఏ. రూపంలో కాలానుగతంగా అనువంశిక సమాచారం సంక్రమించినా డీ. ఎన్. ఏ. పాత్ర ఒక విధంగా నిష్క్రియమైనదే. డీ.ఎన్. ఏ. చేత ఎన్కోడ్ చెయ్యబడ్డ ప్రోటీన్ లు కణాలోని వేవేల చర్యలకి కారకమవుతాయి. ఆ చర్యల సముదాయాన్నే మనం "జీవనం" అంటాము. మానవ జీనోమ్ ప్రాజెక్ట్ పుణ్యమా అని మనకి ఇప్పుడు కొన్ని పదుల వేల జన్యువుల పట్టిక లభ్యం అవుతోంది. ఇప్పుడు ఒకే ప్రశ్న మిగిలి వుంది – "ఈ జన్యువులు నిర్మించిన ప్రోటీన్ లన్నీ కలిసి ఏం చేస్తాయి?" ప్రోటీన్ చర్యలని అర్థం చేసుకోడానికి శాస్త్రవేత్తలు తరచు ఉత్పరివర్తన చెందిన ప్రాణులని అధ్యయనం చేస్తుంటారు. మార్చబడ్డ, లేదా పని చెయ్యని జన్యు ప్రతిని ఒక జీవరాశిలోకి చొప్పించడం ద్వార ప్రత్యేక ఉపరివర్తక జీవాలని తయారు చెయ్యవచ్చు. అలాంటి జీవాల ప్రవర్తనలోగాని, వికాస క్రమంలో గాని మార్పులని పరిశీలించి ఆ ప్రోటీన్ యొక్క క్రియని అర్థం చేసుకోవచ్చు. ఎలుకలు వేగంగా పునరుత్పత్తి చెందుతాయి కనుక, వాటి జీనోమ్ మానవ జీనోమ్ తో 99% సమానం కనుక, విస్తృత స్థాయి క్రియాత్మక అధ్యయనాలలో ఎలుకలని చక్కని జంతు నమూనాలుగా వాడుకోవడం జరుగుతుంది. కాని ఒక జన్యువు యొక్క జన్యు శ్రేణిని కనుక్కోవడం కన్నా ఒక్క జన్వంతర (transgenic) ప్రయోగాన్ని చెయ్యడం ఎన్నో రెట్లు కష్టం. మానవ జీనోమ్ ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఇంకా ఎంతో మిగిలి వుంది.