అంశం 17 డీ.ఎన్. ఏ చేత జన్యువు తయారు చెయ్యబడుతుంది .

A gene is made of DNA.

చచ్చిపోయిన హానికరమైన బాక్టీరియా జాతితో కలిపినప్పుడు సజివంగా ఉన్న, హాని చెయ్యని బాక్టీరియా జాతి కూడా హానికరంగా మారుతుందని 1920 లలో జరిపిన ప్రయోగాల వల్ల తేలింది. చచ్చిపోయిన బాక్టీరియా జాతి నుండి వెలువడ్డ ఏదో రసాయనం హాని చెయ్యని బాక్టీరియాలని విషపూరితంగా "రూపాంతరం" గావిస్తోంది. అలా "రూపాంతరకారక తత్వమే" (transforming principle) జన్యువు అని అర్థమయ్యింది..

1940 లలో రాక్ ఫెల్లర్ సంస్థలో ఆస్వాల్డ్ అవెరీ (Oswald Avery) నేతృత్వంలో పని చేసిన ఒక శాస్త్రవేత్తల బృందం పైన చెప్పబడ్డ ప్రయోగాలని మరింత లోతుగా పరిశోధించింది. ఆ "రూపాంతర కారక తత్వాన్ని" శుద్ధ రూపంలో వెలికి తీసినప్పుడు, ప్రోటీన్లని జీర్ణం చేసే ఎన్జైమ్ లకి దాని మీద ప్రభావం లేదని తెలిసింది. అందుకు విరుద్ధంగా డీ.ఎన్. ఏ లని జీర్ణం చేసే ఎన్జైమ్ లు మాత్రం దాన్ని నాశనం చేశాయి. ఆ "రూపాంతర కారక తత్వం" డీ.ఎన్. ఏ నే అయ్యుంటుందని ఆ విధంగా నిరూపించబడింది. ఆ తర్కాన్ని కాస్త విస్తరింపజేస్తే జన్యువు లో ఉండేది డీ.ఎన్. ఏ. నే అని అర్థమయ్యింది. అయినా కూడా జన్యువు లో ఉండేది డీ.ఎన్. ఏ మాత్రమే నని, ప్రోటీన్ కాదని తెలిపే ఈ ప్రయోగాలని శాస్త్రవేత్తలు అంత సులభంగా సమ్మతించలేక పోయారు.